హాయ్ మేడం. నా వయసు 22. చదువు పూర్త్తెంది. ఒక మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. నేను ఐదేళ్ల నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. మొన్నామధ్యే మా ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసింది. మా అమ్మానాన్నలకు కులం పట్టింపులు ఎక్కువ. మా ఇద్దరి కులాలు వేరు. మాది ఎక్కువ కులం, అబ్బాయిది తక్కువ కులం కావడంతో మా విషయం ఇంట్లో తెలియగానే వాళ్లు నన్ను ఏమీ అనకుండా.. నువ్వు చదువుకోవాలంటే ఆ అబ్బాయిని మర్చిపో అన్నారు. దాంతో నేను నా చదువు ఆగిపోతుందని సరే అని కాలేజీకి వెళ్లాను. మేమిద్దరం దూరంగా ఉండడానికి చాలా ప్రయత్నించాం.. కానీ అది మా వల్ల కావట్లేదు. అతను నాకు బాగా దగ్గరైపోయాడు. జీవితంలో స్థిరపడితేనైనా అమ్మానాన్నలు మా పెళ్లికి ఒప్పుకుంటారని మేం ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు ప్రేమను కొనసాగించాం.
నాకు మా అమ్మానాన్నంటే ప్రాణం.. అలాగని తననూ వదులుకోలేను. తనూ ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో స్థిరపడ్డాడు. మా ప్రేమ మా లక్ష్యాలకు అడ్డుకాకూడదని కష్టపడి చదువుకొని ఇప్పుడు స్థిరపడ్డాం. నన్ను తను చాలా బాగా చూసుకుంటాడు. మా ప్రేమను అబ్బాయి వాళ్లింట్లో ఒప్పుకున్నారు.. కానీ మా ఇంట్లో మాత్రం నాకు సంబంధాలు చూడడం మొదలు పెట్టారని ఈ మధ్యే తెలిసింది. ఏం చేయాలో నాకు తోచడం లేదు. నాకు జీవితంలో చాలా ఆశలు, ఆశయాలు ఉన్నాయి. నా జీవితంలో పెళ్లంటూ జరిగితే అది నేను ప్రేమించిన అబ్బాయితోనే జరగాలని కోరుకుంటున్నా.. తను కూడా అంతే..! ఇద్దరం పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందుకు ఏం చేయాలో, మా పెద్దల్ని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. సలహా ఇవ్వండి.  Read More